హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మొదలైన సోషల్ మీడియా వార్ మరింత వేడెక్కింది. నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే ఘాటు కౌంటర్ ఇచ్చిన నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తాజాగా మరోసారి తీవ్ర స్థాయిలో స్పందించారు.
ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి బండ్ల గణేష్ మాట్లాడుతూ, "నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావ్. నీకు నువ్వే గొప్ప మేధావిని, గొప్ప వీరుడిని అని సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు. కానీ ప్రజలు ఇచ్చే తీర్పే అసలైన సర్టిఫికేట్" అని వ్యాఖ్యానించారు.
"నీ సొంత రాష్ట్రంలో, నీ సొంత ప్రజల మధ్య నిలబడి ప్రజల మద్దతు సంపాదించలేని నువ్వు.. రాష్ట్ర స్థాయి నాయకులను, దేశ స్థాయి నాయకులను, దేశ ప్రధానులు సైతం గౌరవించే నాయకులను విమర్శించే స్థాయిలో ఉన్నానని భావించడం హాస్యాస్పదం" అంటూ విమర్శించారు.
అంతేకాకుండా, "ప్రతి విషయానికీ 'జస్ట్ ఆస్కింగ్' అని చెప్పడం చాలా సులువు. కానీ ప్రశ్నించే ముందు నీకు నువ్వు కొన్ని ప్రశ్నలు వేసుకో. నీ ప్రయాణం ఏంటి? నీ సాధించినది ఏంటి? సమాజం కోసం నువ్వు చేసినది ఏంటి? ప్రజలు నీ వెనుక ఎందుకు నిలబడాలి? అనే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పుకో" అని సూచించారు.
"ఇతరుల గురించి తీర్పులు ఇవ్వడం కంటే ముందు అద్దం ముందు నిలబడి నీ ఆత్మసాక్షిని అడుగు. నీ చరిత్ర ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ నైతిక హక్కు ఏంటి అని ప్రశ్నించుకో. ఎందుకంటే ప్రజలు మాటలను కాదు, వ్యక్తిత్వాన్ని నమ్ముతారు. విమర్శలను కాదు, విశ్వసనీయతను గౌరవిస్తారు" అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.
చివరగా, "ఎత్తైన పర్వతాలను చూసి రాళ్లు విసరడం వల్ల ఎవరి స్థాయి పెరగదు" అంటూ ప్రకాష్ రాజ్‌కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.