ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్‌ఫ్లై పార్క్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి Pawan Kalyan పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళలు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో కలిసి స్వయంగా విత్తన బంతులు తయారు చేశారు.
రాష్ట్రంలోని సుమారు 300 ప్రాంతాల్లో చేపట్టిన సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించిన ఆయన, జూన్ 15 నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం డ్రోన్ల ద్వారా కొండ ప్రాంతాల్లో సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియను వీక్షించారు.
మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించిన పవన్ కళ్యాణ్, ప్రతి ఎకో టూరిజం పార్క్‌లో యోగా హాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే కొండపల్లి కొయ్య బొమ్మలు, ఉదయగిరి కళాకారుల చెక్క కళాఖండాలను పరిశీలించి, కళాకారులకు మార్కెటింగ్ మరియు ప్రచార పరంగా ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి అవసరమైన చెక్కను అందుబాటులోకి తీసుకురావాలని కూడా అధికారులకు సూచించారు.