తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) జరుపుల మోహన్ నాయక్ భారీ అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే విశ్వసనీయ సమాచారంతో ఏసీబీ అధికారులు మియాపూర్, మాదాపూర్‌లోని ఆయన నివాసాలతో పాటు నిజామాబాద్ సహా మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఈ దాడుల్లో భారీ స్థాయిలో అక్రమాస్తులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. మోహన్ నాయక్ నివాసాలు, బంధువుల ఇళ్లలో నిర్వహించిన తనిఖీల్లో 15 బంగారు బిస్కెట్లు, 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి, రూ.55 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా బ్యాంకు ఖాతాల్లో రూ.1.44 కోట్ల నిల్వలు, రూ.1.26 కోట్ల విలువైన విలాసవంతమైన గృహోపకరణాలు గుర్తించారు. ఇంట్లో ఏర్పాటు చేసిన మినీ బార్‌లో రూ.4.44 లక్షల విలువైన 22 విదేశీ మద్యం బాటిళ్లు కూడా లభించినట్లు సమాచారం.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు రోడ్ల నిర్మాణ పనులు, టెండర్లలో భారీగా కమీషన్లు వసూలు చేసినట్లు మోహన్ నాయక్‌పై ఆరోపణలు ఉన్నాయి. సోదాల్లో బయటపడిన చర, స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ.200 కోట్లకు పైగా ఉండొచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మోహన్ నాయక్‌ను అరెస్ట్ చేశారు. నేడు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది.