పంట పొలాల్లో 20 పిల్లలు, 60 గుడ్లు ప్రత్యక్షం మంజీరా సంరక్షణ కేంద్రానికి పిల్లలు, గుడ్ల తరలింపు

ఉమ్మడి మెదక్ జిల్లాలోని సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామ శివారులో మొసలి పిల్లలు కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సోమవారం పశువులను మేపేందుకు వెళ్లిన కాపరులకు రైతుల పంట పొలాల్లో దాదాపు 20 మొసలి పిల్లలు కనిపించాయి. దీంతో వారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది మొసలి పిల్లలను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా సుమారు 60 మొసలి గుడ్లు గుర్తించారు. దీంతో అధికారులు అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టారు.

పట్టుకున్న మొసలి పిల్లలు, గుడ్లను మంజీరా అభయారణ్యం పరిధిలోని మొసళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించారు. సమీపంలోని చెరువులు, మెలిగిరిపేట ప్రాజెక్టు నీటిలో మరిన్ని మొసళ్లు ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

దాదాపు 20 మొసలి పిల్లలు, 60 గుడ్లను అటవీశాఖ అధికారులు తరలించడంతో పరిసర గ్రామాల ప్రజలు, రైతులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.