ల్యాడిల్‌కు రంధ్రం, బయటకు పొంగిన ద్రవ ఉక్కు కార్మికులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం.. లీకేజీ కారణాలపై విచారణ ప్రారంభం

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్-1 టీపీబీ విభాగంలో ల్యాడిల్‌కు రంధ్రం పడటంతో అత్యంత అధిక ఉష్ణోగ్రతలో ఉన్న ద్రవ ఉక్కు కిందకు లీక్ అయింది. గురువారం ఉదయం ఏ షిఫ్ట్‌లో సుమారు 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

ద్రవ ఉక్కు ఒక్కసారిగా ల్యాడిల్ నుంచి బయటకు రావడంతో అక్కడి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కార్మికులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే ప్లాంట్ భద్రతా సిబ్బంది, సాంకేతిక నిపుణులు ప్రమాద స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ద్రవ ఉక్కు లీకేజీకి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా, కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతుండగానే మరోసారి ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడగా, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంలో వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంపై కార్మిక సంఘాలు, స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని, ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.