మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ఒమన్ తీరానికి సమీపంలో ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ గురువారం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ లోని అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన చార్జ్ డి'అఫైర్స్‌ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పిలిపించి అధికారికంగా నిరసన తెలిపింది. ప్రాంతీయ పరిస్థితులు మరింత దిగజారకుండా తక్షణమే సంభాషణలు, దౌత్యపరమైన చర్చలు ప్రారంభించాలని భారత్ పిలుపునిచ్చింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావం వాణిజ్య నౌకాయానంపై పడుతోందని పేర్కొన్నారు. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.
మృతిచెందిన భారతీయుల కుటుంబాలకు భారత్ సంతాపం ప్రకటించగా, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు సంబంధిత దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భారత్ సూచించింది.