మృతుల సంఖ్య 9కి చేరడంతో మానవ హక్కుల కమిషన్ రంగంలోకి.. ఘటనపై సమగ్ర నివేదిక కోరనున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరిన నేపథ్యంలో, National Human Rights Commission (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది.

జూన్ 8న Rashtriya Ispat Nigam Limited పరిధిలోని విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అకస్మాత్తుగా జరిగిన పేలుడులో తొలుత ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. అనంతరం చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి చెందడంతో మృతుల సంఖ్య 9కి పెరిగింది.

ఈ విషాద ఘటనపై మీడియా కథనాలను పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ గురువారం స్పందించింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో, "జూన్ 8, 2026న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన పేలుడులో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందగా, కనీసం ఆరుగురు తీవ్ర కాలిన గాయాలతో బాధపడుతున్నారనే మీడియా నివేదికలపై సుమోటోగా కేసు నమోదు చేశాం" అని పేర్కొంది.

భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు

ఈ ప్రమాదం పరిశ్రమల్లో కార్మికుల భద్రతా ప్రమాణాల అమలుపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. ఘటనకు గల కారణాలు, భద్రతా నిబంధనల అమలు పరిస్థితులు, బాధితులకు అందించిన సహాయం వంటి అంశాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సంబంధిత అధికారుల నుంచి నివేదికలు కోరే అవకాశం ఉంది.