రాజ్యసభ ఎంపీలుగా టీడీపీ, జనసేన అభ్యర్థులు ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన టీడీపీ, జనసేనకు చెందిన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసే నాటికి నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్థులే బరిలో నిలవడంతో వారి ఎన్నిక ఖరారైంది.

టీడీపీ తరఫున సానా సతీశ్, బాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్లు దాఖలు చేయగా, జనసేన పార్టీ నుంచి లింగమనేని రమేశ్ పోటీలో నిలిచారు. ఇతర అభ్యర్థులు ఎవరూ బరిలో లేకపోవడంతో వీరంతా ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనట్లు స్పష్టమైంది.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం జూన్ 1న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం మొత్తం 27 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. జూన్, జులై నెలల్లో 24 మంది సభ్యుల పదవీకాలం ముగియనుండగా, మరో మూడు స్థానాలు ముందుగానే ఖాళీ కావడంతో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.

ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి 8 వరకు నామినేషన్ల స్వీకరణ, జూన్ 9న నామినేషన్ల పరిశీలన, జూన్ 11 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. అవసరమైతే జూన్ 18న పోలింగ్ నిర్వహించి, జూన్ 20 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని ఈసీ పేర్కొంది.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్థులే మిగలడంతో ఎన్నిక అవసరం లేకుండానే టీడీపీకి మూడు, జనసేనకు ఒక రాజ్యసభ స్థానం దక్కింది. దీంతో రాష్ట్రంలో అధికార కూటమి బలం రాజ్యసభలో మరింత పెరగనుంది.