ఇల్లాలు దేశ నిర్మాత ఆమె సేవలకు నెలకు రూ.30వేల విలువ రోడ్డు ప్రమాద పరిహారం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

గృహిణులు కుటుంబానికి అందించే సేవలను తక్కువగా అంచనా వేయరాదని, వారి కృషికి సరైన ఆర్థిక విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2001లో పంజాబ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ మహిళ కుటుంబానికి నష్టపరిహారం పెంచాలని కోరుతూ దాఖలైన అప్పీల్‌పై విచారణ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

2024లో పంజాబ్–హర్యానా హైకోర్టు సదరు మహిళ భర్త, ముగ్గురు పిల్లలకు కలిపి సుమారు రూ.8 లక్షల నష్టపరిహారం మంజూరు చేసింది. అయితే, ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం గృహిణుల సేవలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.

జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్‌కే సింగ్‌లతో కూడిన ధర్మాసనం.. మోటారు ప్రమాదాల్లో గృహిణులు మరణించినా లేదా శాశ్వత వైకల్యానికి గురైనా, వారి కుటుంబాలు కోల్పోయే గృహ సంరక్షణ సేవలను ప్రత్యేక నష్టపరిహార కేటగిరీగా పరిగణించాలని ఆదేశించింది. ఈ సేవల కనీస విలువను నెలకు రూ.30 వేలుగా నిర్ణయించింది.

ఈ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు విశేష ప్రాధాన్యత సంతరించుకున్నాయి. "సంపాదించే వారే వాస్తవానికి గృహిణులపై పూర్తిగా ఆధారపడతారు. కానీ సమాజంలో వారికి దక్కాల్సిన గౌరవం, గుర్తింపు ఇంకా దక్కడం లేదు" అని పేర్కొంది. భవిష్యత్తులో వారిని 'గృహిణులు'గా కాకుండా 'దేశ నిర్మాతలు'గా పిలవడం సముచితమని అభిప్రాయపడింది.

అంతేకాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మహిళల పాత్ర అమూల్యమని సుప్రీంకోర్టు పేర్కొంది. భారత జీడీపీలో మహిళలు వేతనం లేకుండా అందించే సేవల వాటా 15 నుంచి 17 శాతం వరకు ఉంటుందని గుర్తుచేసింది.

రోడ్డు ప్రమాదాల నష్టపరిహార కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై కూడా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులను ఏడాది లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది.

ఇదిలా ఉండగా, గర్భధారణ పూర్వ, ప్రసవ పూర్వ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపైనా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్ష పూర్తిగా తొలగే వరకు ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిందే అని స్పష్టం చేసింది.

"స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా, ఆడపిల్లల చదువు, రక్షణ కోసం ఇప్పటికీ పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాల్సి రావడం బాధాకరం. ఆడపిల్ల పుట్టే హక్కుపై ఎలాంటి ప్రశ్నలు లేని రోజే నిజమైన సమానత్వం సాధ్యమవుతుంది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.