హైదరాబాద్‌లో దోమల సమస్యపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న దోమల బెడదను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన అసెంబ్లీ మీడియా హాల్‌లో దోమతెరతో కుట్టించిన గౌను ధరించి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్‌లో పరిస్థితి తీవ్రమైందని, ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి సమయం లేకుండా దోమలు విస్తరిస్తున్నాయని తెలిపారు. సాయంత్రం సమయంలో ఇళ్లలోకి గుంపులుగా ప్రవేశిస్తూ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని పేర్కొన్నారు. దోమల కాట్ల కారణంగా నగరంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దోమల నియంత్రణకు పలు చర్యలు తీసుకున్నామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. దోమల నియంత్రణలో వైఫల్యం కారణంగా ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అవసరమా అనే ప్రశ్న ప్రజల్లో వస్తోందని అన్నారు.
అలాగే, దోమల సమస్యను ప్రస్తావిస్తూ అసెంబ్లీ మీడియా హాల్‌లో దోమతెరతో ప్రెస్ మీట్ నిర్వహించేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరాన్ని విభజించడం వల్ల సమస్యలు మరింత పెరిగాయని ఆరోపించారు.
నగరంలో దోమల నివారణ కోసం ప్రతి డివిజన్‌కు కనీసం 10 ఫాగింగ్ యంత్రాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని హెచ్చరించారు. కరోనా సమయంలో మాస్క్‌లు ధరించినట్లే, ఇప్పుడు దోమల బెడదను తట్టుకోలేక ప్రజలు దోమతెరలు ఉపయోగించే పరిస్థితి వచ్చిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.