హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నేలు గ్రామంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుమార్తె పుట్టినరోజు సందర్భంగా స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లిన తల్లి, ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
స్థానికుల వివరాల ప్రకారం, అజారుద్దీన్ – ఫర్హత్ (26) దంపతులకు ఉమేరా (8), అయేషా (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు స్థానికంగా ఒక వెంచర్‌లో స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.
బుధవారం రాత్రి, కుమార్తె పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లారు. అయితే అక్కడ ఏమి జరిగిందో తెలియకుండానే ఫర్హత్, ఆమె ఇద్దరు కుమార్తెలు స్విమ్మింగ్ పూల్‌లో మృతదేహాలుగా కనిపించారు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీసి, అనంతరం పోస్ట్‌మార్టం కోసం హనుమకొండలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్త అజారుద్దీన్ ఇది ప్రమాదవశాత్తు జరిగినదని చెబుతున్నప్పటికీ, ఫర్హత్ తల్లిదండ్రులు మాత్రం హత్య అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఫర్హత్ మూడోసారి గర్భం దాల్చిన నేపథ్యంలో దంపతుల మధ్య విభేదాలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు మృతురాలి తండ్రి అలీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.