విజయవాడలో వెలుగులోకి వచ్చిన ఉగ్రవాద లింకుల కేసులో కీలక వివరాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం విచారణలో అనేక సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
పోలీసుల సమాచారం ప్రకారం, సైదా బేగం మహిళలను ఉగ్రవాద దిశగా ఆకర్షించేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నించినట్లు గుర్తించారు. ఇప్పటివరకు ఆమె సుమారు 42 మంది యువతులను రిక్రూట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
‘KHAWATEEN’ పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌ను సృష్టించి, అందులో జిహాదీ భావజాలాన్ని ప్రోత్సహించే వీడియోలు, సందేశాలను షేర్ చేసినట్లు విచారణలో బయటపడింది. ముఖ్యంగా ఒసామా బిన్ లాడెన్, జకీర్ నాయక్ వంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలను గ్రూప్‌లో పంపినట్లు సమాచారం.
అదే విధంగా, ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 40 అకౌంట్ల ద్వారా జిహాదీ కంటెంట్‌ను ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మదర్సాలలో మతపరమైన శిక్షణ తర్వాత ఆయుధాల వినియోగంపై శిక్షణకు సన్నాహాలు చేసినట్లు అనుమానిస్తున్నారు.
వాట్సాప్‌లో పెద్ద మొత్తంలో PDF ఫైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి రిక్రూట్‌మెంట్, ట్రైనింగ్‌కు సంబంధించిన సమాచారంతో ఉన్నట్లు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి మరిన్ని వ్యక్తులు, వివరాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.