కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనం, రెడీమిక్స్ లారీ ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు కన్నుమూశారు. మరో 12 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిని వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరణించిన వారిని అమృత, తేజస్వని, ధన్య, దీపక్, దీక్షిత, ప్రతాప్ కుమార్‌గా గుర్తించారు. వీరంతా చిక్కమగళూరు ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు.
బాధితులు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి దేవస్థానం దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం మరింత విషాదాన్ని కలిగించింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.