ఢిల్లీ విమానాశ్రయంలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం విమానాలు రన్‌వేపై కదులుతున్న సమయంలో ఈ ఢీకొట్టు జరిగింది –

న్యూఢిల్లీ: Indira Gandhi International Airport లో ఇవాళ ఒక పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో Akasa Air మరియు SpiceJet కు చెందిన రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం, ట్యాక్సీయింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్పైస్‌జెట్ విమానం కుడి వైపు వింగ్లెట్ దెబ్బతినగా, ఆకాశ ఎయిర్ విమానం వెనుక భాగమైన హారిజాంటల్ స్టెబిలైజర్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది ఎవరికి గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై Directorate General of Civil Aviation (DGCA) తీవ్రంగా స్పందించింది. రన్‌వేపై విమానాల కదలికల్లో ఎక్కడ లోపం జరిగిందనే అంశంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. గ్రౌండ్ కంట్రోల్ సిబ్బంది లేదా పైలట్ల పొరపాటు ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ప్రమాదం కారణంగా రెండు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికులను ఇతర విమానాల్లో పంపించేందుకు సంబంధిత ఎయిర్‌లైన్స్ ఏర్పాట్లు చేశాయి. ఈ ఘటనతో ఎయిర్‌పోర్ట్‌లో కాసేపు గందరగోళం నెలకొంది.

రన్‌వేపై విమానాలు ఢీకొనడం భద్రతాపరంగా తీవ్ర లోపంగా భావిస్తున్న నిపుణులు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.