విజయవాడలో జనసేన నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం

విజయవాడ: జనసేన పార్టీ బలోపేతం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం విజయవాడలోని తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల జనసేన నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ధర్మానికి కట్టుబడి అందరూ కలిసి పనిచేశారని చెప్పారు. ఐక్యతతో ముందుకు సాగినందువల్లే ఈ విజయప్రస్థానం కొనసాగుతోందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు ఇవ్వకుండా అన్యాయం జరిగిందని విమర్శించారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పదవుల కోసం పార్టీని స్థాపించలేదని, యువత, మహిళలను చైతన్యపరిచి ప్రజాసేవే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. నేడు పంచాయతీ రాజ్ శాఖను దేశంలోనే రెండో స్థానంలో నిలిపేలా పవన్ కల్యాణ్ కృషి చేశారని కొనియాడారు.

విజయవాడలోని 64 డివిజన్లలో జనసేనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. కేవలం బీ-ఫారం తీసుకుని పోటీ చేయడం వల్ల గెలుపు సాధ్యం కాదని, కూటమిలోని అన్ని పార్టీలతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు.

ఎక్కడ జనసేన పోటీ చేయాలి, ఎక్కడ సీట్లు తీసుకోవాలనే అంశంపై పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో జనసేన కమిటీలను ప్రకటిస్తామని వెల్లడించారు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, సీట్లను విశ్లేషించి కొత్త వ్యూహంతో ముందుకు సాగాలని నేతలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.