నిత్యావసర ధరల నియంత్రణ, సరఫరాపై కేంద్ర అధికారులతో చర్చలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ఢిల్లీ పర్యటనలో ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల సరఫరా, ధరల నియంత్రణ, వినియోగదారులకు సరసమైన ధరలకు సరుకులు అందుబాటులో ఉంచే అంశాలపై ఆయన కేంద్ర అధికారులతో చర్చించారు.

ఈ క్రమంలో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) మేనేజింగ్ డైరెక్టర్‌ను మంత్రి కలిశారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల సరఫరా తీరు, ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.

అనంతరం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేను నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

మరోవైపు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సివిల్ సప్లై శాఖ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన రైస్ స్టోర్‌ను మంత్రి ప్రారంభించారు. ఢిల్లీలో నివసించే తెలుగువారికి నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉండేలా ఈ స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని రేపు కలవనున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సందర్భంగా పామ్ ఆయిల్, ఉల్లిపాయలు, పప్పుల ధరలపై చర్చించనున్నట్లు చెప్పారు. సివిల్ సప్లై శాఖలో అవినీతికి తావులేకుండా ఇప్పటికే పలు చర్యలు చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు.