అమరావతి, సెప్టెంబర్ 7: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన ప్రత్యేకంగా చర్చించారు. ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవద్దని నేతలకు సూచించారు.
కూటమి పార్టీల మధ్య పూర్తి సమన్వయం, సఖ్యత ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీలోని నేతల మధ్య ఎలాంటి గ్యాప్‌లు ఉండకూడదని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సమర్థవంతమైన మహిళా నేతలను ముందుగానే గుర్తించి సిద్ధం చేయాలని చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలను పరిష్కరించామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని, ఆ సానుకూలత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల రూపంలో ప్రతిఫలించాలని ఆకాంక్షించారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించడంపైనే తన ధ్యాస, ఆలోచన అంతా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో 2024 కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు.
పరిపాలనతో పాటు పార్టీ వ్యవహారాలకు కూడా ప్రతిరోజూ సమయం కేటాయిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. స్థానిక స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో కూటమి విజయానికి నేతలు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు.