హైదరాబాద్, సెప్టెంబర్ 7: యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ కావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు ఆమెను గుర్తించినట్లు సమాచారం. అనంతరం ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు ఆర్‌జీఐఏ పోలీసులు అప్పగించారు.
లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నందన, ఆమె భర్త పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించిన పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. వారి ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వ్యవహారంలో నందనపై ఉన్న కేసులు, ఆమెపై జారీ చేసిన లుక్‌అవుట్ నోటీసుల ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగాల పేరుతో ఎంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు? ఎంత మొత్తంలో తీసుకున్నారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.