విజయనగరం, సెప్టెంబర్ 8: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్రలో వైసీపీకి కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తనకు అప్పగించిన పార్టీ పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు మేనల్లుడైన మజ్జి శ్రీనివాసరావు.. తన రాజీనామా నిర్ణయాన్ని తెలియజేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ పంపినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్ష పదవితో పాటు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను కూడా మజ్జి శ్రీను వదులుకున్నారు. గతంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా ఆయన పనిచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఆయన రాజీనామా చేయడం విజయనగరం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.