విజయవాడ, సెప్టెంబర్ 8: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత సుస్మిత కొణిదెలకు అరుదైన గౌరవం దక్కింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ఆమెను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధికి సంబంధించి సూచనలు చేయడం, ప్రత్యేక ఉత్సవాల నిర్వహణలో భాగస్వామ్యం కావడం వంటి అంశాల్లో సుస్మిత తన సేవలను అందించనున్నారు.
సుస్మిత కొణిదెల సినీ నిర్మాతగా రాణిస్తున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇటీవల తన తండ్రి చిరంజీవితో కలిసి నిర్మించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ సేవలందిస్తున్న విషయం తెలిసిందే.