హైదరాబాద్: ఖైరతాబాద్ భారీ గణపతి ఆగమన్ కార్యక్రమానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. శుక్రవారం రాత్రి ఆగమన్ నిర్వహించేందుకు యువజన సంఘాలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. భారీ గణపతికి రంగుల అద్దకం పూర్తికాగా.. కిరీటానికి వజ్రాలు, వైఢూర్యాలతో అలంకరణ పనులు కొనసాగుతున్నాయి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే గేటు నుంచి ఖైరతాబాద్ ప్రధాన రహదారి మీదుగా ఐసీఐసీఐ బ్యాంకు మార్గంలోనూ అదనపు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వైద్య సేవలు, సమాచార కేంద్రంతో పాటు వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక విశ్రాంతి షెడ్లను నిర్మిస్తున్నారు.
భక్తులకు ప్రతిరోజూ ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ క్యాడెట్లకు భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నివాసంలో ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. సినీ ప్రముఖులు, అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు, పలువురు వీఐపీలు వచ్చే అవకాశం ఉండటంతో భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు.