కాకినాడ, సెప్టెంబరు 9 పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్‌రెడ్డి మృతి కేసులో నిందితుడిగా ఉన్న సాదిక్ ఖాన్ విషపూరిత పదార్థాలు కొనుగోలు చేసిన వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మూడు రోజుల కస్టడీలో భాగంగా రెండో రోజు బుధవారం సాదిక్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన అత్తరు వ్యాపారులు రెహ్మన్, అబ్దుల్ ఖాదీర్‌ను సర్పవరం పోలీసులు విచారించారు.
విచారణలో వ్యాపారులు సాదిక్ తమ వద్దకు వచ్చి విషపూరిత ద్రవం కావాలని అడిగినట్లు వెల్లడించినట్లు సమాచారం. తాము తొలుత ఒక రసాయన పదార్థాన్ని ఇచ్చామని, దాని అవసరం ఏమిటని ప్రశ్నించగా.. తాను రైఫిల్ షూటర్‌నని, కొంత పని ఉందని సాదిక్ చెప్పినట్లు వారు పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది.
తొలిరోజు విచారణలో సాదిక్ పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించలేదని సమాచారం. తనపై ఉన్న ఆరోపణలను నూకరాజు కుమార్తె సౌజన్యపైకి నెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
రెండో రోజు అడిషనల్ ఎస్పీ మహంతి కిశోర్, సీఐ ప్రకాశ్, మరో ఇద్దరు ఎస్‌ఐలు సాదిక్‌ను వివిధ కోణాల్లో ప్రశ్నించారు. విషపూరిత పదార్థాల కొనుగోలు, వాటి వినియోగం, నూకరాజు కుటుంబ ఘటనతో ఉన్న సంబంధంపై పోలీసులు కీలక ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.