ప్రజల్లో కూడా పారిశుధ్యంపై అవగాహన కల్పించేలా, మార్పు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

పార్వతీపురం మన్యం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక చొరవతో పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభించనుంది. బోదకాలు వ్యాధితో ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులకు శాశ్వత ఉపశమనం కల్పించడంతో పాటు పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.4.68 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది.

పనుల పురోగతిపై పవన్‌ కళ్యాణ్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత, ప్రజల సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టాలని, పనులు పూర్తయిన తర్వాత నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రజల్లో పారిశుధ్యంపై అవగాహన పెంచి, గ్రామంలో పరిశుభ్రత విషయంలో శాశ్వత మార్పు తీసుకురావాలని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయని అధికారులు సమీక్షలో వెల్లడించారు.

ఇప్పటికే 27 అంతర్గత సిమెంట్‌ రోడ్లు, 12 సిమెంట్‌ డ్రెయిన్లు, 6 డ్రెయిన్‌ కమ్‌ రోడ్ల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. మురుగునీటి సమస్య పరిష్కారానికి 41 మ్యాజిక్‌ డ్రెయిన్లు నిర్మించినట్లు వివరించారు. సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామంలో ప్రజల రాకపోకలు సులభతరమయ్యాయని అధికారులు తెలిపారు.

అదేవిధంగా రోడ్లకు ఇరువైపులా కొబ్బరి చెట్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సుమారు 3,000 మొక్కలు నాటినట్లు డిప్యూటీ సీఎంకు వివరించారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి.