ఈ సందర్భంగా పులి కదలికలపై అటవీ శాఖ, ‘హనుమాన్’ బృందాలు నిరంతర నిఘా కొనసాగించాలని పవన్ ఆదేశించారు.

కాకినాడ జిల్లా, సెప్టెంబర్ 10: ప్రత్తిపాడు మండలం ధారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచారంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీ శాఖ చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ సరిహద్దు గ్రామాల భద్రతకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపైనా ఆరా తీశారు.

పులి కదలికలపై అటవీ శాఖతో పాటు ‘హనుమాన్’ బృందాలు నిరంతర నిఘా కొనసాగించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. పులి జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా రాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అదే సమయంలో పులికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ సూచించారు.

పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ, అవసరాన్ని బట్టి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన కలగకుండా, అటవీ సరిహద్దు గ్రామాల్లో అవగాహన, అప్రమత్తత చర్యలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు.