కేరళ, సెప్టెంబరు 11: సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో ప్రముఖ క్షేత్రంగా పేరొందిన కేరళ రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీరామస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆలయంలో నిర్వహించిన విశిష్ట సేవల్లో ఒకటైన దీపారాధన సేవలో ఆయన పాల్గొన్నారు.
ఒక రోజు దీపారాధన సేవకు విరాళం అందించిన పవన్ కళ్యాణ్ స్వయంగా దీపాలు వెలిగించారు. ఆలయ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధాన దీపాలకు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆలయ సంప్రదాయాలను అనుసరిస్తూ దీపారాధనతో పాటు మీనుట్టు, వేది వజిపాడు సేవల్లోనూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శంఖుచక్రాలతో పాటు ధనుస్సు, హారం ధరించిన శ్రీరామస్వామి వారి అద్భుత రూపాన్ని దర్శించుకుని సంధ్యాకాల అర్చనలు నిర్వహించారు. శ్రీరామస్వామి వారితో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణుడు, అయ్యప్ప స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.
అనంతరం గర్భాలయంలో మూలవిరాట్టుకు కుడివైపున ఉన్న దక్షిణామూర్తి, నైరుతి దిక్కున ఉన్న వినాయకుడు, అనంతపద్మనాభ స్వామివారి శయన రూపానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజల అనంతరం ఆలయ మేల్ శాంతి (ప్రధాన అర్చకుడు) శ్రీ రామన్ తిరుమేని పవన్ కళ్యాణ్‌కు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు.
అంతకుముందు శ్రీరామస్వామి క్షేత్రానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు కొచ్చిన్ దేవస్థానం బోర్డు చైర్మన్, ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ అడ్మినిస్ట్రేటర్, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.