కర్నూలు, సెప్టెంబర్ 14: రోజులు తరబడి శ్రమించి.. ఊహకు రూపమిచ్చి.. భక్తిని కళతో మేళవించి సరికొత్త గణనాథుడిని ఆవిష్కరించారు. చూసినవారంతా ఒక్కసారి ఆగి చూసేలా, చిన్నారులు ఆసక్తిగా అడిగేలా, పెద్దలు ఫొటోలు తీసుకునేలా ఈ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని కొండవీటి ప్రాంతంలో వినాయక చవితి వేడుకలు ప్రత్యేకంగా జరుగుతాయి. ఇక్కడి వినాయక మండపం నిర్వాహకులు గత 36 ఏళ్లుగా ప్రతి ఏడాది వినూత్న రీతిలో గణనాథుడిని ప్రతిష్ఠిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పూజా కార్యక్రమాల్లో వినియోగించే వస్తువులతోనే ఒక్కో సంవత్సరం ఒక్కో విభిన్న రూపంలో విగ్రహాన్ని రూపొందిస్తున్నారు.
ఈ ఏడాది శ్రీ మత్స్యావతార రూపంలో గణనాథుడిని తయారు చేశారు. అరుదుగా లభించే ఆలు చిప్పలు, శంఖాలు, గౌమేధికం వంటి వస్తువులను వినియోగించి విగ్రహాన్ని అలంకరించారు. ఇందుకోసం చీరాల, బాపట్ల సముద్ర తీర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా సామగ్రిని తీసుకొచ్చారు. సుమారు రెండు నెలల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు.
విగ్రహం తయారీకి ఉపయోగించిన మట్టిని కూడా ప్రత్యేకంగా సేకరించారు. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలోని మంత్రాలయం, గురుజాల తదితర పుణ్యక్షేత్రాల సమీప ప్రాంతాల నుంచి మట్టిని తీసుకొచ్చి గణపతి విగ్రహాన్ని తయారు చేశారు.
ఈ సందర్భంగా వినాయక మండలి సభ్యుడు తెలుగు రాముడు మాట్లాడుతూ.. గత 36 ఏళ్లుగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందని, అందుకే ప్రతి ఏడాది మట్టి గణనాథుడినే ప్రతిష్ఠిస్తూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పారు.
ఈ ఏడాది సముద్ర తీర ప్రాంతాల నుంచి తెచ్చిన ఆలు చిప్పలు, శంఖాలు, గౌమేధికంతో మట్టి గణపతిని మత్స్యావతార రూపంలో రూపొందించామని తెలిపారు. విగ్రహం తయారీకి సుమారు రూ.5 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఈ వినూత్న గణనాథుడిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.