కృష్ణలంక సీఐ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పేలుడు పదార్థాలను క్వారీ బ్లాస్టింగ్‌ కోసం తరలిస్తున్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

విజయవాడ, సెప్టెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టాండ్‌లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుమానాస్పదంగా కనిపించిన ఓ బ్యాగ్‌ను ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అందులో 46 జెలటిన్‌ స్టిక్స్‌, 50 డిటోనేటర్లు ఉన్నట్లు బయటపడింది.

సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు వెంటనే బస్‌స్టాండ్‌కు చేరుకుని బ్యాగ్‌ను పరిశీలించారు. తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు బయటపడటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనతో బస్‌స్టాండ్‌లో కొద్దిసేపు భయాందోళన నెలకొంది.

కృష్ణలంక సీఐ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పేలుడు పదార్థాలను క్వారీ బ్లాస్టింగ్‌ కోసం తరలిస్తున్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే అవి బస్‌స్టాండ్‌కు ఎలా చేరాయి? ఎవరు తీసుకొచ్చారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్‌ అలీ అనే వ్యక్తి నరసరావుపేట నుంచి విజయవాడకు బస్సులో వచ్చినట్లు సమాచారం. విజయవాడ చేరుకున్న తర్వాత తాను బస్సులో తీసుకొచ్చిన బ్యాగ్‌ మారిపోయి, మరో ప్రయాణికుడి బ్యాగ్‌ తన వద్దకు వచ్చినట్లు అతడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

అయితే బ్యాగ్‌ మార్పిడి ఎలా జరిగింది? పేలుడు పదార్థాలు ఉన్న బ్యాగ్‌ ఎవరిది? వాటిని ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.