అమ్మవారి ఆలయానికి భక్తుల సంఖ్య పెరగడంతో నిధులు దుర్వినియోగమవుతున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌కు ఫిర్యాదులు వచ్చాయి.

కాకినాడ జిల్లా: కరపలోని వారాహి అమ్మవారి ఆలయాన్ని దేవాదాయ శాఖ తన ఆధీనంలోకి తీసుకోవడంతో జనసేన పార్టీ సీనియర్ నేత చిక్కాల దొరబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఆలయాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవడంపై ఆయన కంటతడి పెట్టుకున్నారు.

తన సొంత స్థలంలో, సొంత నిధులతో ఆలయాన్ని నిర్మించానని, ఇప్పటివరకు ఆలయం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశానని దొరబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్కడున్న భక్తులు ఆయనను ఓదార్చారు.

జనసేన నేత చిక్కాల వీర వెంకట సత్యనారాయణ (దొరబాబు) సొంత నిధులతో కరపలో ఈ ఆలయాన్ని సుమారు ఆరు నెలల క్రితం నిర్మించారు. కాశీలో వారాహి అమ్మవారి విగ్రహాన్ని రూపొందించిన ప్రసిద్ధ కళాకారుడే కరపలోని అమ్మవారి విగ్రహాన్ని చెక్కినట్లు తెలిపారు. ఈ విగ్రహం అయోధ్య బాలరాముడి రూపాన్ని పోలి ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఆలయం ప్రారంభమైన కొద్ది కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం, రావులపాలెం నుంచి ఆర్టీసీ బస్సులను కూడా నడుపుతోంది.

అయితే ఆలయానికి భక్తుల సంఖ్య పెరగడంతో నిధుల దుర్వినియోగం జరుగుతోందంటూ కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు కలెక్టర్ కమిటీని నియమించారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలోని అధికారులు ఆలయాన్ని పరిశీలించిన అనంతరం ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలని నిర్ణయించారు.

దీంతో దేవాదాయ శాఖ అధికారులు ఆలయాన్ని స్వాధీనం చేసుకుని, సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం గ్రేడ్–1 ఈవో రాపాక శ్రీనివాస్‌ను సింగిల్ ట్రస్టీగా నియమించారు. ఆయనతో ప్రమాణ స్వీకారం కూడా చేయించారు.

అనంతరం ఆలయంలోని హుండీలకు అధికారులు సీల్ వేశారు. రసీదు పుస్తకాలను అప్పగించాలని ఆలయ ధర్మకర్త దొరబాబుకు నోటీసులు జారీ చేశారు. ఈ ఆలయం ఇకపై దేవాదాయ శాఖ పరిధిలో కొనసాగుతుందని అధికారులు తెలిపారు.