త్యాగానికి ప్రతీకగా భావించే ఈద్-ఉల్-అజ్హా (బక్రీద్) పండుగను దేశవ్యాప్తంగా ముస్లింలు గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే మసీదులు, ఈద్గాల వద్ద భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక నమాజ్‌లు నిర్వహించారు. పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జామా మసీదు, ఫతేపురి మసీదు సహా ప్రధాన ఈద్గాల వద్ద వేలాది మంది ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఢిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్ మధుర్ వర్మ మాట్లాడుతూ.. ఇప్పటివరకు వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని, నగరంలో ఎక్కడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనలేదని తెలిపారు.
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో హిందూ-ముస్లిం మత సామరస్యం మరోసారి వెలుగుచూసింది. అక్కడ ఒక దేవాలయం, ఈద్గా ఒకే ఉమ్మడి గోడను పంచుకుంటూ ఉండటం విశేషం. స్థానిక ఆలయ నిర్వాహకుడు ఓం ప్రకాష్ మాట్లాడుతూ.. “తరతరాలుగా ఇక్కడ హిందూ, ముస్లింలు ఎంతో సఖ్యతతో జీవిస్తున్నారు. ఒకవైపు ఆలయంలో పూజలు, మరోవైపు ఈద్గాలో నమాజ్ ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా జరుగుతాయి” అని తెలిపారు.
దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు శాంతియుతంగా జరగడంతో ప్రజలు పరస్పరం సోదరభావాన్ని చాటుకున్నారు.