పది వేల జీతం నుంచి కేఎన్‌ఆర్‌ వందల కోట్లకు కబ్జాలు, వసూళ్లు, సెటిల్మెంట్ల జోరు వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్‌ రెడ్డికి నోటీసు కేఎన్‌ఆర్‌కు బినామీ అని సిట్‌కు ఆధారాలు

మాజీ సీఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు కేఎన్‌ఆర్ (కె. నాగేశ్వర రెడ్డి) ఆస్తుల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు విజయవాడలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో కేఎన్‌ఆర్ అక్రమ ఆస్తులు, భూ సెటిల్మెంట్లు, రాజకీయ టికెట్ల పేరుతో వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

అలాగే విజయవాడలోని కార్ల షోరూమ్, పలువురు బినామీల పాత్రపై కూడా సిట్ దృష్టి సారించింది. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండగా, త్వరలో ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశముందని సమాచారం.వైసీపీ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో కేఎన్‌ఆర్‌ రూ.వందల కోట్ల ఆస్తులు పోగేశారు. దీనిపై పోలీసులు ఆరా తీయగా.. ఆయన దందాలు, వసూళ్లు వెలుగుచూశాయి.

అధికారంలోకి రాకముందు జగన్‌ పాదయాత్ర చేపడితే, కేఎన్‌ఆర్‌ వసూళ్లు మొదలుపెట్టారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలతో రెండు, మూడు లక్షల రూపాయలు తీసుకుని జగన్‌తో ఫొటోలు తీయించే స్థాయి నుంచి 2019లో నాలుగైదు కోట్లు తీసుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసేవారికి ఎన్నికల బీ ఫారాలు ఇప్పించే స్థాయికి ఎదిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యేగా ఉన్న ఒక బీసీ నాయకుడు టికెట్‌ కోసం కేఎన్‌ఆర్‌ కోట్లాది రూపాయలు తీసుకున్నాడంటూ ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఉభయ గోదావరి జిల్లాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆశావహుల నుంచీ ఆయన భారీగా వసూలు చేశారు. తన దగ్గరికి రాని వారిని మీపై నివేదికలు వ్యతిరేకంగా వచ్చాయంటూ బెదిరించి వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.