ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడుపవన్ కళ్యాణ్ పై తెలంగాణలో కొందరు రాజకీయ నాయకులు, విశ్లేషకులు, సోషల్ మీడియా వర్గాలు చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, రైతులు, యువత, హిందూ దేవాలయాల పరిరక్షణ, పర్యావరణ అంశాలపై గళమెత్తుతున్న నాయకుడిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం జనసేన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.
ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ వివాదాలు చెలరేగాయి. కొన్ని వర్గాలు ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు గుప్పించగా, జనసేన నేతలు మాత్రం ఆయన ఉద్దేశం ప్రజల సమస్యలను ప్రస్తావించడమేనని స్పష్టం చేస్తున్నారు.
అంతేకాకుండా, పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్, వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యులను కూడా లాగుతూ కామెంట్లు చేయడాన్ని అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిపై రాజకీయ విమర్శలు సహజమే అయినా, వ్యక్తిగత దూషణలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వారు చెబుతున్నారు.
ప్రస్తుతం గోదావరి కాలుష్య సమస్య, రైతుల ఇబ్బందులు, అభివృద్ధి అంశాలపై పవన్ కళ్యాణ్ చురుకుగా స్పందిస్తూ అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజల తరఫున నిలబడే నాయకుడిగా ఆయన వ్యవహరిస్తున్నారని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రజల కోసంమాట్లాడితే విమర్శలు రావడం సహజం. కానీ ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతున్న నాయకుడిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదు" అని జనసేన కార్యకర్తలు అంటున్నారు. రాజకీయ భేదాలు ఉండొచ్చు కానీ పరస్పర గౌరవం ఉండాలని వారు కోరుతున్నారు.