మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీల పరిధిలోని పరిశ్రమలు, విద్యాసంస్థలు పన్నులు ఎగవేస్తున్న అంశంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ ఉద్యోగులు, మత్స్యకారులు, మధ్యతరగతి ప్రజలు సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నప్పుడు కోట్ల రూపాయల ఆదాయం పొందే పరిశ్రమలు, విద్యాసంస్థలు పన్నులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.
పంచాయతీలకు పరిశ్రమల నుంచి రూ.115.57 కోట్లు, విద్యాసంస్థల నుంచి రూ.45 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. ఈ నిధులు వసూలైతే గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, సిబ్బంది జీతాల సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయని చెప్పారు.
పంచాయతీల పరిధిలో ఉన్న పరిశ్రమలు, విద్యాసంస్థలు, హోటళ్లు, హ్యాచరీలపై సమగ్ర అధ్యయనం చేయడానికి డీపీఓలతో సాధికార కమిటీ ఏర్పాటు చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పన్ను వసూళ్లలో అవకతవకలు, రాజకీయ ఒత్తిళ్లను సహించబోమని స్పష్టం చేశారు.
గత 30 ఏళ్లలో అన్యాక్రాంతమైన పంచాయతీ ఆస్తులపై కూడా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీల స్వయం సమృద్ధి కోసం కొత్త ఆదాయ వనరులపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.