సముద్రంలో రక్తపాతం.. 700 తిమింగలాలు, డాల్ఫిన్‌ల దారుణ వధ

ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని Faroe Islandsలో మరోసారి వివాదాస్పద సంప్రదాయ వేట ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. 'గ్రిందాడ్రాప్' (Grindadrap) పేరుతో నిర్వహించిన ఈ వేటలో కేవలం కొన్ని రోజుల్లోనే 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్‌లను స్థానికులు వేటాడి చంపినట్లు సమాచారం.

పర్యావరణ సంస్థ Sea Shepherd తెలిపిన వివరాల ప్రకారం, సముద్రంలో గుంపులుగా సంచరించే తిమింగలాలు, డాల్ఫిన్‌లను వందలాది మోటార్ బోట్లు, జెట్ స్కీల సాయంతో తీరం వైపు తరిమి తీసుకువచ్చారు. అనంతరం తీరానికి చేరుకున్న వాటిపై కత్తులు, ఈటెలు, బల్లేలు వంటి ఆయుధాలతో దాడి చేసి హతమార్చారు.

ఈ ఘటనలో సముద్రపు నీరు రక్తంతో ఎర్రగా మారిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులు, పర్యావరణ వేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన వైకింగ్ సంప్రదాయం పేరుతో జరుగుతున్న ఈ వేటను వెంటనే నిలిపివేయాలని పలు అంతర్జాతీయ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

"సంప్రదాయం పేరుతో సముద్ర జీవులపై జరుగుతున్న ఈ క్రూరత్వం మానవత్వానికే మచ్చ" అంటూ పర్యావరణ కార్యకర్తలు మండిపడుతున్నారు.