ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో వాతావరణ మార్పులు
ఆగ్నేయ బంగాళాఖాతంలో, శ్రీలంకకు సమీప ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడుతూ పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే, బుధవారం నాటికి ఇది నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా. ఈ ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతుండటంతో ప్రజలు వణుకుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున నుంచి ఉదయం 9 గంటల వరకు చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది.
ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వాయుగుండం ప్రభావం ఎక్కువగా తమిళనాడుపై ఉండనుందని, అక్కడ విస్తారంగా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాబోయే మూడు రోజుల పాటు ఎక్కువగా పొడి వాతావరణమే కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఉదయం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశముందని హెచ్చరించింది.