ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం
ఈ ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తిగా గుర్తింపు
ఈ ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తిగా గుర్తింపు
మార్షల్ ఆర్ట్స్ పట్ల చిన్ననాటి నుంచే గాఢమైన అభిరుచి కలిగిన సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం Pawan Kalyan మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము విద్య అయిన కెంజుట్సులో ఆయన అధికారికంగా ప్రవేశించి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు.
జపాన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక యుద్ధకళల సంస్థ సోగో బుడో కన్రి కై పవన్ కల్యాణ్‌కు ఫిఫ్త్ డాన్ (5వ డాన్) హోదాను ప్రదానం చేసింది. అలాగే అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయనకు ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ అనే ప్రత్యేక బిరుదుతో సత్కరించింది.
ఇంకా విశేషమేంటంటే… జపాన్ వెలుపల సోకే మురుమత్సు సైన్సై ఆధ్వర్యంలోని టకెడా షింగెన్ క్లాన్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ కల్యాణ్ రికార్డు సృష్టించారు. మూడు దశాబ్దాలకు పైగా సాగించిన నిరంతర సాధన, పరిశోధన, అంకితభావానికి గుర్తింపుగా ఈ గౌరవాలు లభించాయని జనసేన వర్గాలు తెలిపాయి.
ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ మార్గదర్శకత్వంలో పవన్ కెండోలో కఠిన శిక్షణ పొంది, ఉన్నత స్థాయి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సినిమా, యుద్ధకళలు, యుద్ధ తత్వశాస్త్రాన్ని ఒకే వేదికపై సమన్వయం చేయగల అరుదైన భారతీయ ప్రముఖుల్లో ఆయన ఒకరిగా నిలిచారు.
బహుముఖ ప్రతిభకు మరో నిదర్శనం
నటుడిగానే కాకుండా రచయిత, దర్శకుడు, స్టంట్ కో-ఆర్డినేటర్, కొరియోగ్రాఫర్, గాయకుడిగా పవన్ కల్యాణ్ తన బహుముఖ ప్రతిభను నిరూపించారు. సినిమాల్లోకి రాకముందే మార్షల్ ఆర్ట్స్ సాధన ప్రారంభించిన ఆయన, చెన్నైలో ఉన్న రోజుల్లో కఠినమైన శిక్షణతో బలమైన పునాది వేసుకున్నారు.
శారీరక సాధనతో పాటు జపనీస్ సమురాయ్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి, వాటిని నిబద్ధతతో అనుసరించారు. అదే ప్రభావం ఆయన సినిమాల్లోనూ కనిపించింది. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’, ‘తమ్ముడు’, ‘ఖుషి’, ‘అన్నవరం’, ‘ఓజీ’ వంటి చిత్రాల్లో మార్షల్ ఆర్ట్స్‌ను తెరపై ప్రదర్శిస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
సినీ రంగం, రాజకీయాలు, యుద్ధకళలు—మూడు రంగాల్లోనూ తనదైన ముద్రతో ముందుకు సాగుతున్న పవన్ కల్యాణ్ ఈ గౌరవాలతో మరోసారి భారతీయుల గర్వాన్ని పెంచారు.